జ్యేష్ట మాసం ప్రారంభం: ఏడుకొండల వాడికి అభిషేకం: పుణ్య ప్రాప్తి కోసం ఏం చేయాలి..?

Feature

oi-M N Charya

|

డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151

చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠ మాసం మూడవ నెల. ఈ మాసంలోని పూర్ణిమరోజు చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల దీనికి జ్యేష్ఠమాసం అని పేరు ఏర్పడింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైంది. మహా విష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజూ బ్రహ్మదేవుడిని పూజించాలని శాస్త్రవచనం.

జ్యేష్ట మాసంలో ‘ఇంద్ర’ నామము కల సూర్యుడు తన యొక్క తొమ్మిదివేల కిరణములతో లోకమును తరింపజేయును. ఈ ఇంద్ర కిరాణాలే వర్ష ఋతువు నందు వర్షకారకాలుగా మారుతాయి.అంతేకాక ఈ మాసమునకు తెల్లని వస్త్రం ధరించిన రుద్రగణములు అధిపతులుగా ఉంటారు. ఈ మాసంలో రుద్రాభిషేకాదులు తాపశాంతిని కలుగజేస్తాయి. విష్ణుసహస్ర నామములతో ‘జ్యేష్ట ప్రజాపతి’ అని దేవతలందరిలో శ్రేష్టుడిగా, జ్యేష్టుడిగా చెప్పబడ్డ విష్ణువును త్రైవిక్రమునిగా, వామనునిగా ఈ మాసమంతా పూజించవలెను.అంతేగాక ఈ మాసమంతా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పూజించడం కుడా శాస్త్రంలో చెప్పబడినది.

Jyestha Month 2021

ఈ మాసమంతా జలదానం చేయడం పుణ్యలోక ప్రాప్తిని కలుగజేయును.ఈ మాసంలో తిరుమలలో వేంకటేశ్వరస్వామి వారికి జ్యేష్టాభిషేకములు నిర్వహిస్తారు. జగమంతా శాంతిగా ఉండడానికే కాక సంవత్సర కాలంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటి పరిహారార్ధం ఇవి నిర్వహిస్తారు. పురుషోత్తమ క్షేత్రము అయిన ‘పూరీ’ లో కుడా సుభద్ర సహిత జగన్నాధ, జలభద్రుల మూలవిరాట్టుకు అభిషేకం నిర్వహిస్తారు.

ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని “నిర్జల” అంటారు ఆహార సమృద్ధి ఇస్తుంది. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని ‘యోగిని’ అంటారు. పాపములను హరిస్తుంది.

ఈ మాసం కొన్ని ముఖ్యమైన వ్రతాలకు … పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది. పితృదేవతల రుణం తీర్చుకోవడానికీ … పాపాలను పరిహరించుకోవడానికి … దైవసేవలో తరించడానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి. ఈ మాసంలో బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

పార్వతీదేవి ఆచరించిన ‘రంభావ్రతం’ … వివాహిత స్త్రీలు ఆచరించే ‘అరణ్యగౌరీ వ్రతం’ … గంగానది స్నానంతో పది రకాల పాపాలను హరించే ‘దశాపాపహర దశమి’ … ‘త్రివిక్రమ ఏకాదశి’ పేరుతో పిలవబడే ‘నిర్జల ఏకాదశి’ భక్తకోటిపై తమ ప్రభావం చూపుతుంటాయి. అలాగే సూర్యుడిని ఆరాధించే ‘మిథున సంక్రమణం’ … వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ‘ఏరువాక పున్నమి’ ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే ‘జ్యేష్ఠ పౌర్ణమి’ … శ్రీమహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే ‘అపర ఏకాదశి’ ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను … మరెన్నో విశేషాలను సంతరించుకుని, పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ వుంటుంది.

పంచాంగ రిత్య జ్యేష్టమాసం ఫలితాలు:- 2021 జూన్ 11 నుండి జులై 9 వరకు జ్యేష్టమాసం. ఈ మాసానికి మేఘాధిపతి కుజుడు నీచస్థితిలో ఉన్నందున నైరుతి ఋతుపవనాలు ప్రారంభామైననూ, మందగమనంతో ఉండటం, ఉపరితల ఆవర్తనాలు, పీడనాలు పూర్తిస్థాయిలో వర్షాన్ని ఇవ్వలేక పోవచ్చును. జ్యేష్ట అమావాస్య ఆరుద్ర నక్షత్రం తొలకరికి సహకరించును. అన్ని ప్రాంతముల వారికి ఉన్నంతలో వ్యవసాయ అనుకులతలుగా ఉండును. తుఫాన్ సూచనలున్నాయి. జూన్ 10 నుండి 16, 30 నుండి 5 వ తేదీల మధ్య వర్షములు ఉండును.

English summary

Jyestha Month 2021

Story first published: Friday, June 11, 2021, 6:00 [IST]

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *