కేసీఆర్‌కు ఇంత అహంకారమా అంటూ ఆరోజు గంగుల ఆగ్రహం.. కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని స్వాగతించా : ఈటల

20 ఏళ్లలో చాలా చూశా : ఈటల

20 ఏళ్లలో చాలా చూశా : ఈటల

గడిచిన 20 ఏళ్ల రాజకీయంలో టీఆర్ఎస్‌ పార్టీలో చాలా చూశానని.. అందరి లిస్ట్ తన దగ్గర ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తనపై విమర్శలు చేసేవారు మంత్రులుగా కాకుండా.. మనుషులుగా మాట్లాడాలని హితవు పలికారు.కనీసం తనపై విమర్శలు చేస్తున్న మంత్రులకైనా ఇకనుంచి కేసీఆర్ గౌరవం ఇవ్వాలని కోరుతున్నానని ఎద్దేవా చేశారు. ప్రగతిభవన్‌లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని విమర్శించారు.

'కేసీఆర్‌కు ఇంత అహంకారమా అన్నాడు గంగుల..'

‘కేసీఆర్‌కు ఇంత అహంకారమా అన్నాడు గంగుల..’

కొన్నాళ్ల క్రితం సీఎంకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి మంత్రులం ఆయన్ను కలవడానికి వెళ్తే తమను అనుమతించలేదని ఈటల పేర్కొన్నారు. ఆ సమయంలో… కేసీఆర్‌కు ఇంత అహంకారమా? అని మంత్రి గంగుల కమలాకర్‌ తనతో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. మంత్రుల విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఎవరి వ్యాఖ్యలపై తాను స్పందించనని… నాతో ఎవరేం మాట్లాడారో అంతా తెలుసని చెప్పుకొచ్చారు.

కేటీఆర్‌ సీఎం అభ్యర్థిత్వాన్ని స్వాగతించా : ఈటల

కేటీఆర్‌ సీఎం అభ్యర్థిత్వాన్ని స్వాగతించా : ఈటల

‘నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా పని చేయలేదు.. మంత్రి కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని నేను వ్యతిరేకించలేదు.. స్వాగతించా… నాపై కక్ష సాధించడం సరికాదు.. 2014 వరకే కేసీఆర్‌ ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నారు. తెలంగాణ గాంధీగా పేరు గాంచిన గొప్ప వ్యక్తి ఇవాళ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. నాకు నోటీసులు కూడా ఇవ్వకుండా చర్యలకు ఉపక్రమించారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇంత కుట్రపూరితంగా ఎవరూ వ్యవహరించలేదు.ఎవరివో తప్పుడు సలహాలు, నివేదికల వల్ల నాపై కక్ష సాధిస్తున్నారు. నా వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నవారంతా నా సహచరులే. ఎవరి గురించి కామెంట్ చేయను..’ అని ఈటల స్పష్టం చేశారు.

ఇకనుంచి అందరితో కలుస్తా : ఈటల

ఇకనుంచి అందరితో కలుస్తా : ఈటల

వ్యక్తులు ఇవాళ ఉంటారు.. ఆ తర్వాత పోతారు… కానీ ధర్మం ఎక్కడికీ పోదు. ప్రభుత్వం దుర్మార్గ వైఖరికి నేను కోర్టు ద్వారానే బదులిస్తా. ఒక మనిషికి ఒక పార్టీ, వ్యక్తితో మాట్లాడే అవకాశం,స్వేచ్ఛ ఉండదా అని ప్రశ్నించారు. 2014 కంటే ముందు కాంగ్రెస్‌ మంత్రుల దగ్గరకు వెళ్లి అభివృద్ధి పనులు తెచ్చుకోలేదా? అని నిలదీశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు టీఆర్ఎస్ మంత్రులను కలవడానికి వస్తే ఫిక్స్‌ అయిపోయిందా? అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇతర పార్టీల నేతలతో మాట్లాడితే తప్పా? ఇకపై అన్ని పార్టీల నాయకులతో మాట్లాడతానని ఈటల చెప్పుకొచ్చారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *